Thursday, October 21, 2010

ఆ రోజులని గుర్తు చేసుకుందామని...!


మళ్ళీ ఓ పాతిక సంవత్సరాలు ముందుకి....అంటే.. ఈ సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, టి.విలు, MP3 ప్లేయర్ లు లేని కాలం లోకి వెళ్తే బాగుండు అనిపిస్తుంది, ఆ రోజులే బాగున్నాయి, మనిషి బ్రతికినన్నాళ్ళు ప్రశాంతంగా వున్నాడు, ప్రతి రోజూ వెనుక నుండి ఎవరో మనల్ని తరుముకొస్తున్నట్టు, ఎంత కాలం ఇలా మనిషి అతి ఆశా జీవి గా బతుకుతాడు, తన పనిని వేగవంతం, సులభవంతం చేసుకోవడానికి లేని కష్టాల్ని తెచ్చుకొంటున్నాడు.

నిన్నటికి నిన్న అయోధ్యా తీర్పు విడుదల అయ్యేసరికి దేశమంతా అలజడి అంతా ఇంతా కాదు, అదే ఆ కాలం అయ్యి వుంటే తర్వాత రోజు వార్తా పత్రిక చూసేదాక తీర్పు గురించి తెలియదేమో .. రేడియో అయితే తప్ప.

మొబైల్ టెక్నాలజీ పేరుతో పిచుకల చిరునామా కాస్త మాయం చేశారు, కంప్యూటర్ల పేరుతో మనిషి బుర్రకి పని చెప్పడం తగ్గించేసారు, వినోదం పేరుతో కాలాన్ని వృధా చేస్తున్నారు.

ఒకప్పుడు ఎవరన్నా ముఖ్యమైన సమాచారం చేరవేయాలి అంటే పొరుగూరి నుండి పక్కింట్లో వున్న ఫోన్ కి ఫోన్ చేసి కట్టె-కొట్టె-తెచ్చె అన్నట్టు ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పి విషయాన్ని చేరవేసేవాళ్ళు..మరి ఇప్పుడొ ఇంట్లో ఉప్పు నుండి మొదలెడితే ఇంక ఆ మాటల ఎక్కడికి వెళ్తాయంటే...మన దేశ ఆర్ధిక పరిస్థితి ఇలా ఎందుకు తయారయ్యింది అన్న దాక...   

దేశంలో జరిగే సమాచారాన్ని అతి పారదర్శకం గా మేమంటే మేము చూపిస్తున్నాము అని ఒకరికొకరు పోటీపడి చూపిస్తున్న ఈ టి వి చానెళ్ళ  కంటే చక్కగా రేడియోలో ఆకాశవాణి పెట్టుకొని వార్తలు, పాటలు వింటూ కునుకు తీసే ఆ రోజులే నయం. ఇప్పటికీ ఈ పని చేసేవాళ్ళు కూడ వున్నారు మరి.
ప్రతి శుక్రవారం .. దూరదర్శన్ లో వచ్చే చిత్రలహరి కోసం వారం నుండి వేచివుంటే తీరా ఆ రోజు కరెంట్ పోయేది, అదే ఇప్పుడైతే వచ్చిన ప్రోగ్రాంలని తిప్పి తిప్పి నువ్వు చచ్చినట్టు ఎలా అయినా చూసేటట్టు చేస్తారు

ఓ సంవత్సరంలో పది సినిమాలు వచ్చేవి మరి ఇప్పుడు కళ్ళు  మూసి కళ్ళు  తెరిచేలోపు లెక్కపెట్టలేనన్ని...అందులో మంచివి ఎన్ని కానివి ఎన్నో వేరే చెప్పనక్కరలేదు.

సరిగ్గా పది సంవత్సరాలు కూడ నిండవు వానికి ఓ పెద్ద మోటార్ సైకిల్ తో ఊర్లో కసరత్తులు,పచార్లూ,..సరిగ్గా ధైర్యం చేసి ఓ సైకులు తీసుకొని బయటికి వెళ్తే, "ఈ సైకిల్ ఏ కంపెనీది?, ఈ సైకిల్ ఎంతకి తీసావ్?', అని అడిగేవాళ్ళు అప్పుడైతే.

పల్లెటూర్లలో చిన్నతనంలో పదవ తరగతి వరకు చదవడం అయ్యేదాక, వున్న ఊరిని వదిలేవాళ్ళు కాదు, ఇప్పుడైతే ఉన్న ఇళ్ళు పొలాల్ని అమ్మి బిడ్డల కోసం టౌన్ లకి వచ్చి మీన మేషాలు లెక్కపెడుతూ వారి భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

ఊరికో నాయకుడు ఉండి నలుగిరికి సేవ చేసి అందరి నాలుకల్లో నానేవాడు అప్పుడు,
వీధికో నాయకుడు ఇప్పుడు, సేవ గురించి పక్కన పెడితే తన పర బేదం చూపే వాళ్ళే ఎక్కువ.

వ్యాపారం పేరుతో సూపర్ మార్కెట్లని పెట్టి చిన్న చిన్న కిరాణా దుఖాణాల్ని మూయించారు. కారంటే అంబాసిడర్ లేకుంటే మారుతి మరి ఇప్పుడో..!, దేశానికి రైతు వెన్నుముక లాంటివాడు కాని ఇప్పుడు దేశానికి వెన్నుముక ఇంధనం ధనం, అదే డబ్బున్నొడిదే రాజ్యం..!.

ఎవరన్నా పొరుగింట్లో ఒకరు పక్క దేశానికి..అంటే ఏ కువైట్ కో ఏ దుబాయ్ కో వెళ్తే,"అయ్యో! వాళ్ళకి సరిగ్గ గడువక అలా వెళ్ళారేమో", అనేవారు..ఇప్పుడంతా అతి సంపాదన అత్యాశ..వున్న ఊరిని సొంత గూటిని వదిలి సంవత్సరాలు తరబడి బయటి దేశాలలోనే వలస బ్రతుకులు విలాస జీవితాలు గడుపుతున్నారు.

 ఆ రోజుల్ని కంటికి కనిపించినట్లు చూడాలంటే..శివ నాగ్ గారు డైరెక్ట్ చేసిన ..ఆర్ కె నారాయణ్ గారి "మాల్గుడి డేస్", మరచిపోలేని ఓ దృశ్య కావ్యం...

ఇదంతా ఎందుకు చెబుతున్నాడు వీడు అస్సలు టెక్నాలజీ ఉపయోగించుకోడా అని అనుకోకండి ...నేనూ ఉపయోగిస్తాను.. .. ఆ రోజులని గుర్తు చేసుకుందామని .... :-)