Monday, January 31, 2011

Thursday, January 27, 2011

ఎంత విడ్డూరమో ...!

 

పెరుగిన ముడిసరకుల ధరలతో ప్రస్తుతం పేదవాడు మూడు పూట్ల భొజనం మాట దేవుడెరుగ,
తృప్తిగా రెండు పూట్ల చేతివేళ్ళు నొటి దగ్గరకి వెళ్ళడమే కష్టం.
పెరిగిన ధరల పై మేమంటే మేము పోరాడుతాము అని పేదలకి మాటలిచ్చి నాయకులై వారి కష్టాల్ని మరిచి విలాస వంతమైన భవనాలలో భొగ భగ్యాలు అనుభవిస్తూ కాలం వెలిబుచ్చుతున్నారు.
భారత దేశంలో అతి చవకగా ఆహారం దొరికే ప్రాంతం మీకెవరికన్న తెలుసా.?
అదే మన భారత దేశ పార్లమెంటరీ భవన క్యాంటీన్,ఢిల్లీ,    
అక్కడ దొరికే పధార్దాల రేట్ల విషయానికి వస్తే ఇవిగో,

టీ - 1 రూ||
సూప్ - 5.50 రూ||
పప్పు - 1.50 రూ||
భొజనం - 2.00 రూ||
చపాతి - 1.00 రూ||
చికెన్ - 24.50 రూ||
దోస - 4.00 రూ||
వెజ్ బిర్యాని - 8.00 రూ||
ఫిష్ - 13.00 రూ||

ఇలా ఎన్నో .....

ఈ పదార్దాలు దేశ సేవ చేసే నాయకుల కోసం అంట (వారి వుద్దేశం వాళ్ళు పేదలని),
కాని మనకి సేవ చేసే నాయకుల నెలసరి ఆదాయం 80,000/-,
ఎంత  విడ్డూరమో ...! 

ఈ రేట్లని చూస్తే ప్రతి పేదవానికి ఆశ కలగక మానదు,
మాకు ఇలాంటి ధరలలో ఆహారం దొరకపోదా అని..
కానీ నమ్మక ద్రొహం చేసే నాయకులని గెలిపించినంత కాలం అది అందనంత ఎత్తులో వున్న జాబిలీ అని ఎప్పుడు తెలుస్తుందో ఏమో...!

Friday, January 7, 2011

Tuesday, January 4, 2011

ఎక్కడివీ సిరులు?..ముత్తాతవి ఆకలి కేకలు ..ముని మనవడివి తరగని నిధులు


 
అది కడప జిల్లాలోని బలపనూరు గ్రామం. ఆ ఊరిలో వైఎస్ వెంకట రెడ్డి అనే పేద రైతు! ఆయనకు ఇద్దరు భార్యలు. ఒక భార్యకు పది మంది సంతానం, మరో భార్యకు ఒక కుమారుడు. పదిమంది సంతానంలో ఒక్కరు... వైఎస్ రాజారెడ్డి. ఆయన రాజశేఖరరెడ్డి తండ్రి. అసలే బక్క రైతు! ఆపై గంపెడు సంతానం కావడంతో సహజంగానే వెంకట రెడ్డిని పేదరికం వెంటాడింది.

ఆయనే కాదు ఈ ప్రాంతంలో అనేకమంది రైతులు నిరుపేదలే. బ్రిటిష్ పాలనలో, మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైన ఈ ప్రాంతాన్ని దుర్భిక్షం తరచూ పలకరించేది. తెల్లవాళ్ల పాలనలో అందే సహాయమూ ఏమీ ఉండేది కాదు. అదే సమయంలో.. కడప మీదుగా బొంబాయి-మద్రాస్ రైల్వే లైన్ పడింది. ఈ ప్రాంతంలో క్రైస్తవ మిషనరీల రాక ప్రారంభమైంది. పలురకాల కారణాలతో చాలా మంది పేదలు మతం మారి క్రైస్తవం పుచ్చుకున్నారు.

వారిలో... వెంకట రెడ్డి ఒకరు! అప్పట్లో మతం మారడాన్ని గ్రామస్థులు, బంధువులు తీవ్రంగా పరిగణించి, దాదాపు వెలివేసినంత పని చేసేవారు. ఈ పరిస్థితుల్లో వెంకటరెడ్డి తన కుటుంబంతో సహా సొంత ఊరిని వదిలి పులివెందులకు వలస వెళ్లారు. అక్కడే క్రైస్తవ మిషనరీ శిబిరంలో తలదాచుకున్నారు. మిషనరీ స్కూలులో గంట కొట్టే పనికి కూడా కుదిరారు. కొంత భూమిలో చీనీ (బత్తాయి) పండ్ల సాగు చేపట్టారు.

అయినా ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. ఆయన అలాగే బండి నెట్టుకొచ్చారు. వెంకటరెడ్డికి ఉన్న 11 మంది పిల్లల్లో రాజారెడ్డిది ప్రత్యేక శైలి. 'ఉన్న చోట ఉండొద్దు. ఇంకా ముందుకు వెళ్లాలి' అనే తత్వం. బహుశా... 'నేను అనుభవించిన కష్టాలు... నా పిల్లలు అనుభవించొద్దు' అని కూడా అనుకుని ఉండొచ్చు. ఈ క్రమంలో రాజారెడ్డి అవకాశాలను వెతుకున్నారు. మొట్టమొదటిసారిగా క్రైస్తవ మిషనరీలకు సంబంధించిన కాంట్రాక్టులను చేపట్టారు. మెల్లమెల్లగా చుట్టుపక్కల భూములు కొనడం ప్రారంభించారు.

రాజారెడ్డి కొన్నాళ్లలోనే ధనికుడయ్యారు. ప్రైవేటు సైన్యాన్ని నడిపారు. 'రాజారెడ్డి అంటే పులివెందుల చుట్టుపక్కల గ్రామాలకు ఒక పెద్దమనిషి! ఆయనంటే జనానికి హడల్'. ఇదే సమయంలో ఆయన కన్ను బైరటీస్‌పై పడింది. పెట్రోలియం శుద్ధికి ఉపయోగించే ఈ ఖనిజానికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. కడప జిల్లాలోని మంగంపేటలో ఉన్న బైరటీస్ గనులకు వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి పూర్తిస్థాయి యజమానిగా ఉండేవారు.

రాజారెడ్డి ఏం చేశారో, ఎలా చేశారో తెలియదుగానీ... ఉన్నట్టుండి వెంకటసుబ్బయ్య గనుల వ్యాపారంలో భాగస్వామిగా మారారు. కొన్నేళ్లకు మొత్తం గనులను తనకే విక్రయించాలని వెంకట సుబ్బయ్యను కోరారు. ఆయన ససేమిరా అన్నారు. కొన్నాళ్లకు... వెంకట సుబ్బయ్య హత్యకు గురయ్యారు.

ఆయనను ఎవరు చంపారనే విషయం ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అయితే... వెంకట సుబ్బయ్య వారసులు వైఎస్‌పై సచివాలయంలోనే జరిపిన కాల్పుల్లో ఆయన తప్పించుకోగా ఉద్యోగి గాయపడ్డారు. ఏదైతేనేం... అప్పట్లో బైరటీస్ గనులు రాజారెడ్డి సొంతమయ్యాయి.

చదువుకో నాన్నా!

రాజారెడ్డికి చదువు ప్రాధాన్యం బాగా తెలుసు. అందుకే... తన పిల్లలందరినీ బాగా చదివించారు. వైఎస్‌ను చిన్నతనంలో మిషనరీ స్కూలుకు పంపారు. ఆ తర్వాత కర్ణాటకలోని గుల్బర్గా మెడికల్ కాలేజీలో చేర్పించారు. తండ్రి బాగా సంపాదిస్తుండటం, అడగాల్సిన అవసరం లేకుండానే ఇస్తుండటంతో... వైఎస్ వద్ద పుష్కలంగా డబ్బు ఉండేది.అప్పట్లో ఆయన బాగా ఖరీదైన సిగరెట్లు కాల్చేవారని సహ విద్యార్థులు చెబుతారు. మెడిసిన్ పూర్తయ్యాక వైఎస్ మిషనరీ ఆస్పత్రిలో డాక్టర్‌గా చేరారు. అయితే... రాజారెడ్డి లావాదేవీలు బాగా విస్తరించడం, మంగంపేట బైరటీస్ గనులు కూడా సొంతం కావడంతో వ్యాపారంలో తనకు సహకరించేందుకు ఆయన వైఎస్‌ను ఒప్పించారు.

రాజకీయ ప్రవేశం...

రోజులు గడిచేకొద్దీ... పులివెందులలో రాజారెడ్డి చేసిందే చట్టం అనే పరిస్థితి నెలకొంది. పెద్దసంఖ్యలో అభియోగాలున్నప్పటికీ... ఎమర్జెన్సీ సమయంలోనూ ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సాహసించలేదు. ఒకవైపు కడప జిల్లాలో బాంబులు, హత్యల సంస్క్తృతి అంతకంతకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో... అప్పటి జిల్లా కలెక్టర్‌గా ఉన్న అధికారి రాజారెడ్డితో మాట్లాడి, కొన్నాళ్లు జైలులో ఉంటేనే 'సేఫ్'గా ఉంటుందని నచ్చజెప్పారు.

ఇందుకు రాజారెడ్డి సరే అన్నారు. ఏడాదిపాటు జైలు జీవితం గడిపారు. దేశమంతా ఎంతో కొంత అభివృద్ధి చెందు తున్నప్పటికీ... కడప మాత్రం వెనుకబడే ఉంది. బాంబులు, హత్యలు, ముఠాకక్షలతో తల్లడిల్లుతోంది. ఈ క్రమంలో రాజా రెడ్డి చూపు రాజకీయాలపైకి మళ్లింది. తమ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవాలంటే రాజకీయ అధికారం కూడా తమ చేతిలో ఉండాలని ఆయన భావించారు.

అంతే... 1978లో వైఎస్ పులివెందుల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచారు. అప్పట్లో కాంగ్రెస్‌లో చీలిక రావడంతో... వైఎస్‌కు సులువుగానే టికెట్ లభించింది. 29 ఏళ్ల వయసులోనే ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మంత్రి కూడా అయ్యారు. వైఎస్‌ను రాజీవ్ బాగా చేరదీశారు. 35 ఏళ్ల వయసులోనే ఆయనను పీసీసీ అధ్యక్షుడిని చేశారు. ఎంపీ టికెట్ ఇచ్చారు. రాజీవ్ మరణం తర్వాత వైఎస్‌కు రాజకీయంగా కష్టాలు మొదలయ్యాయి.

పీవీ నరసింహారావు ప్రధాని అయ్యారు. ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంగంపేట బైరటీస్ గనుల లీజులను రద్దు చేసింది. ఇది... వైఎస్ కుటుంబానికి శరాఘాతంలా తగిలింది. ఆ తర్వాత కొన్నాళ్లకే రాజారెడ్డి హత్యకు గురయ్యారు. కేంద్రంలో పీవీ హయాం ముగియడం, వైఎస్ మళ్లీ పీసీసీ చీఫ్ కావడం కాస్త అటూఇటుగా జరిగిపోయాయి. అత్యధిక కాలం ప్రతిపక్షంలో ఉండటం, ఏళ్ల తరబడి సొంత వర్గాన్ని నిర్వహించాల్సి రావడంతో వైఎస్‌కు క్రమక్రమంగా ఆర్థిక కష్టాలు తలెత్తాయి. చివరికి... ఒక దశలో సొంత ఇంటిని సైతం అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

దశ తిరిగింది...

వరుస కరువులు, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం, ఇంకా అనేక కారణాలవల్ల చంద్రబాబు తొమ్మిదేళ్ల అధికార శకం ముగిసింది. ఆ స్థానంలో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో... ఆయన దశ కూడా తిరిగింది. అధికారం కోసం సుమారు పాతికేళ్లకు పైబడి వేచి చూడటం, ఈ దశలో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో... ఇకపై ఇలాంటి పరిస్థితి తలెత్తకూడదనే కసి వైఎస్‌లో పెరిగింది.

సహజంగానే ఆయనలో ఉన్న 'నాయకుడు' మేల్కొన్నాడు. ఎవరితో ఎలా డీల్ చేయాలో... అలా చేశారు. వినూత్నమైన విధానాలను అనుసరించారు. 2005, 2007 మధ్య ఉన్న బూమ్‌ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నారు. 'పార్టీ ఫండ్' పేరిట నెల నెలా పెద్దమొత్తంలో ఢిల్లీకి మూటలు పంపుతూ అధిష్ఠానాన్ని మచ్చిక చేసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆయనే అధిష్ఠానంగా మారారు.

అప్పటిదాకా... ఎక్కడో బెంగళూరులో ఉంటూ వ్యాపారాలు చేసుకున్న వైఎస్ కుమారుడు జగన్ తండ్రి అధికారాన్ని సోపానాలుగా చేసుకుని అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు. 2008-09 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.2.92 లక్షల ఆదాయపు పన్ను కట్టిన జగన్... ఈఏడాది ఏకంగా రూ.84 కోట్లు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారు.

అంటే... ఆయన వార్షిక ఆదాయం రూ.500 కోట్లు. 2009 మొదటి ఆరు నెలలకు చెల్లించిన పన్నుతో పోల్చితే.. 2010 తొలి ఆరునెలల్లో 1100 రెట్లు అధికంగా జగన్ పన్ను కట్టారు. ఇదీ... ఆయన స్థాయి! సంతానాన్ని పోషించలేక మతం మారిన ముత్తాత వెంకటరెడ్డి ఎక్కడ... కొన్ని తరాలకు సరిపడా ఆస్తులు కూడగట్టుకున్న జగన్ ఎక్కడ!?

వేస్తారా సంకెళ్లు?

'నిరుపేదగా పుట్టడం నీ తప్పు కాదు. కానీ.. నిరుపేదగా మరణించావంటే మాత్రం కచ్చితంగా నీలో లోపం ఉన్నట్లే!' అనేది ఒక సూక్తి! ఈ క్రమంలో వైఎస్ రాజారెడ్డి విజయం సాధించినట్లే. అలాగే.. 'ఎంత సంపాదించావన్నది కాదు! ఎలా అన్నదే ముఖ్యం' అనే నానుడి కూడా ఉంది! ఈ కోణంలో మాత్రం వైఎస్ కుటుంబం సంపాదనా శైలిపై అనుమానం వ్యక్తం చేయాల్సిందే.

ధీరూబాయ్ అంబానీ, లక్ష్మీ మిట్టల్... వంటి వారి వెనుక కొన్నేళ్ల శ్రమ ఉంది. మరి జగన్‌కు ఆరేళ్లు తిరగ్గానే అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినట్లు? అన్ని కంపెనీలు ఎలా స్థాపించినట్లు? వైఎస్ సీఎం కాకపోతే జగన్‌కు ఈ సిరి ఉండేదా? మీడియా అనేకసార్లు గుట్టును రట్టు చేసింది. ఇక ప్రశ్నించాల్సింది పౌర సమాజమే! కళ్లు తెరవాల్సింది ప్రభుత్వ యంత్రాంగమే! కట్లు తెంచుకోవాల్సింది చట్టం చేతులే!

(సంపాదకీయం ఆంధ్రజ్యోతి దిన పత్రిక నుండి....తేది: హైదరాబాద్, డిసెంబర్ 19)